ఉషాకిరణాలు
ఉషాకిరణాలు
ఆమెకిష్టం తెల్లవారి వెలుగు
అతనికది నిద్రాభంగం
ఆ వెలుగుతో నిద్ర లేచి
డాబా మీది మొక్కల్ని పలకరించడం
పెరటి చెట్ల పరిమళాలతో కాఫీని ఆస్వాదించడం
ప్రకృతి ఇచ్చే సాంత్వన అని ఆమె అభిప్రాయం
ఆ వెలుగు చిరాకని
మరలా యాంత్రిక జీవనం గడిపే సమయం వచ్చేసిందని
ఒక హెచ్చరికగా అతని భావన
సముద్రం మీద పడే ఉషా కిరణాలు
కాంతితో రంగు మారినట్లున్న నీరు
ఒళ్లు విరుచుకుంటూ లేచే పక్కింటి పెంపుడు పిల్లులు
ప్రతి సూర్యోదయం ఆమె దినచర్యలో ఒక ముఖ్య భాగం
సుఖంగా దొర్లుతున్న శరీరాన్ని
కష్టపెడుతూ మార్నింగ్ వాక్ కి సిద్దం చేసే మనుషులు
అతనికి నవ్వు తెప్పిస్తారు
కర్టెన్లు మూసేసి మరలా నిద్రను హత్తుకోవడం అతని దినచర్యలో ఒక ముఖ్య భాగం
చిత్రమేమిటంటే
ఆ ఇరువురినీ ఒక బంధం కలిపింది
ప్రకృతి మాయకు కట్టుబడని వాళ్ళెవ్వరు
అంటూ సూర్యుడి వెలుగులో
చంద్ర బింబం మెరిసింది
