తప్పెవరిదైనా
తప్పెవరిదైనా
తప్పెవరిదైనా చెలీ తపనిద్దరిదీతగువేదైనా సఖీ మధనిద్దరిదీ..
కదిలే పాదాల మధ్య పెరిగే దూరాలు మనవే
రగిలిన వాగ్యుద్ధాల మధ్య నలిగే హృదయాలూ మనవే
మూగ బాసల సంభాషణల్తో నిండిన అగాధాలు మనవే
కనుసన్నల సంజాయిషీలలో పెరిగిపోయిన అపోహలూ మనవే !
అలిగి అటు తిరిగిన నేత్రాల్లో పొగిలే చలమలూ మనవే
విరిగిన పెదవుల సందుల్లో వంగిన భావాలూ మనవే
కఠినత ముసుగుల మరుగున కరిగిన నవనీతాలూ మనవే
మన కలల ఖైదుల్లో జీవిత బందీలూ మనమే! ..
మనమల్లుకున్న స్పర్ధల సాలె గూళ్ళల్లో బరువెక్కిన గుండెలు వేళ్ళాడాల్సిందేనా ?
మనం కట్టుకున్న దర్పాల కోటబురుజుల్లో బందీగా భావాలిలా పతనమనాల్సిందేనా ? !
తప్పులు పట్టే తత్వాన్నొదిలి ఒప్పును చెయ్యగ పరుగున చేరా
అక్కున చేర్చగ చేతులు చాచి రెక్కలు గట్టుకు దగ్గిర వాలా ! ..

