తపన
తపన


గలగల పారే సెలయేటి పరవళ్లు-నీ చిరునవ్వుల సవ్వళ్లు
మేలిమి మకరందపు సిరులు-నీ తీపి పలుకుల మరులు
అలుపెరుగక కురిసే ధ్రువదేశపు మంచు-కొలువైనది నీ చలువ చూపుల అంచు
నిలువెల్లా అల్లుకున్న మరుమల్లె తీగలు-సదా పెనవేసిన నీ చెలిమి రాగాలు
కనిపించే ఊపిరివై నా మనసంతా నిండినావే
వికసించే ఉదయమై నా తనువంతా పండినావే
నింగిలోని తారలను నేర్పుగ కలిపి నా ఊహల్లో వెన్నెల రంగవల్లి వేసితివే
రంగుల హరివిల్లుని తొడిగి మయూరివై మదిలో పురివిప్పి నర్తించితివే
నను చెక్కుటకు వచ్చిన చక్కని చుక్కవే
నా దిక్కులను చక్కదిద్దే చుక్కానివే
నీ తలపుల తామరలు నా తనువంతా విరబూసెనే
నా మనసు తమకంలో సుగంధాలు స్రవియించెనే
వలపు అలల అలికిడికి మెలికలు తిరిగెనే నా మనసుకి
చిలిపి కలల అలజడికి మొలకలు పెరిగెనా నీ సొగసుకి
నీకై పరితపించే మనసు పిలుపు ఆలకించవే
నీపై కురిపించే ప్రీతిని మనోనేత్రాలతో తిలకించవే
కరుణిస్తే ఎడబాటే ఎరుగని పల్లవి-చరణాలకు సమఉజ్జీలమవుదాం
కలిసొస్తే విడదీయలేని వేడి-వెలుతురులకు ప్రతిరూపాలమవుదాం