తాత్కాలిక ప్రయాణం
తాత్కాలిక ప్రయాణం
ఓ బ్రతుకుజీవుడా...
పుడుతూ ఏడుస్తావు, చనిపోతూ ఏడిపిస్తావు !
చిరునవ్వు చిందిస్తావు, బాధలను భరిస్తావు !!
కష్టాన్ని నమ్ముకుంటావు, ఇష్టాన్ని అమ్ముకుంటావు !
విధి ఆడే నాటకంలో వీధిపాలవుతావు !!
ప్రేమే పవిత్రమంటావు, అందాన్ని ఆకర్షిస్తావు !
గుణమే గొప్పదంటావు, ఐశ్వర్యాన్ని ఆర్జిస్తావు !!
పద్ధతులను పాటిస్తానంటావు, ప్రకృతిని పాడుచేస్తావు !
పరులకు ప్రాధాన్యమిస్తానంటావు, పట్టెడన్నం పెట్టనంటావు !!
అజ్ఞానమనే అంధకారమే నీ ఆయుధమంటావా ?
అహంకారమనే ఆభరణమే నీ అలంకారమంటావా ??
మట్టిలో చేరే తనువుపై మమకారమెందుకోయి ?
గాలిలో కలిసే ఆత్మ పై అభిమానమేలనోయి ??
కుక్కకాటు నుండి కరోనా కాటు వరకూ...
శరణయ్యాని వేడుకున్నా మరణశయ్య తద్యమే కదా!
కనురెప్పవిప్పి కట్టెకాలేలోపే జీవితమంటే,
నడిమధ్య ఈ నాటకమేల నరుడా! ఓ మానవుడా!!