స్వర రాగాలు
స్వర రాగాలు
అక్షర విన్యాసాలు
ఆరోగ్యమైన పదాలు
నిర్మలమైన మనసులో
పుష్పించిన స్వర రాగాలు...
నిప్పు కణాలపై
చల్ల నీళ్ల వర్షము లా
వేడెక్కిన హృదయానికి
కర్పూరం సువాసనలు వెదజల్లాలి..
వాడిన చెట్టుకు చిగుర్లు వచ్చినట్లు
శిశిరంలో వసంతం కురవాలి
గుండె భారమై ఏడ్చినప్పుడు
మధురమైన లాలి పాటలా సాగాలి..
అమ్మలోని ఆప్యాయత
నాన్నలోని అనురాగములా
అనునిత్యం ప్రేమలు కురిపిస్తూ
ఆప్యాయత జడివానలో తడవాలి..
ఎడారి జీవితానికి
ఒయాసిస్ తోడుగా సాగుతూ
మధురమైన రుచుల ఫలాలు అందిస్తూ
కన్నీటిని పన్నీరు గా మార్చాలి..
గుండెలోని అనంతం బాధను
చిరునవ్వులతో తుడిచి వేసి
ఓదార్పు అనే మంత్రముతో
మనసులో నిర్మలత్వం చేకూర్చాలి..
నీ బాధలు పోగు చేయడం కాదు
పక్కోడి కన్నీళ్లు తుడుస్తూ
గుండె భారాన్ని తొలగించి
హృదయాల్లో చలివేంద్రమై నిలవాలి..
మాటలోనే ఉంది మర్మం
చెప్పగలిగితే తెలుస్తుంది సత్యం
విషపు మాటలను తుంచి వేస్తూ
అమృత వాక్యాలతో సేద తీర్చాలి...
కవిత్వం అంటే నిత్య ఘర్షణ కాదు
మనసులో ఆనందం నింపు మధుర గుళికలు
యుద్ధ వాతావరణంలో ప్రేమ పలుకులు
శాంతికపోతమై ఎగిరే అక్షరపు రెక్కలు..
