స్వాగతాంజలి
స్వాగతాంజలి
నూతన వత్సరము
మిహిక బిందువుల్జారగా మిన్నునుండి
పర్ణములఁ రాల్చి వృక్షముల్ వణకుచుండ
క్రొత యాశలు కలిగించి కోర్కె తీర్చ
వచ్చె నీధరపై నూత్న వత్సరంబు
ముదము నొందుచు జనులార!కదలి రండి!
ఘోరమైనట్టి రోగముల్ కుదిపి వేయ
నీరసంబుగ మనుజులు నిలిచి యుండ
దివ్యమైనట్టి శోభతో దిశలు వెలుగ
ప్రభలు జిమ్ముచు వచ్చెనీ వసుధయందు
భయము బాపెడి నూతన వత్సరంబు.
మనిషి మనసులో తరగని మానవతను,
ధర్మ బుద్ధిని శాంతిని, సద్గుణములఁ
నింపగా నిటువచ్చె దా నెనరు తోడ
వరము లిచ్చెడి నూతన వత్సరంబు.
సామరస్యమే జాతికి సంపదెపుడు
తారతమ్యము చూపుట తగదు తగదు
పేద గొప్పల భేదమున్ బెఱికి వేసి
కులమతంబను గోడలన్ గూల్చివేసి
కల్మషంబులు గలమదిఁ గడిగి వేసి
నిర్మలంబగు హృది తోడ నేస్తులనుచు
పొరుగు వారిని ప్రేమించు బుధజనంబు
కలిసి కట్టుగ నిలబడి కరము మోడ్చి
స్వాగతించగ రారండి!జయము పలికి!
వైభవంబుగ నూతన వత్సరమును.//
