జ్ఞాన సంపన్నుడు
జ్ఞాన సంపన్నుడు
దేవఋషి నారదుడు దివ్యాత్ముడై నిలిచి
భావమందున హరిని ప్రణతితో నర్చించు
చతురాననుని సుతుడు జ్ఞానసంపన్నుండు
జితకాముడై జగతి క్షేమముకు తపియించు
పంకజాక్షుని కథలు ప్రవచించి యాధ్యాత్మ
శంకలను తీర్చుచూ జడత్వము నిర్జించు
భక్తిసూత్రంబులను ప్రజలకై బోధించి
ముక్తిపథగాములకు మోక్షంబు కలిగించు
గాన కోవిదుడు ఘన కళ్యాణ కారకుడు
వీణ మ్రోగించుచు విభేదాలు తొలగించు
మూడులోకాలలో ముచ్చటగ ద్రిమ్మరుచు
నాడుతూ పాడుతూ నార్తులను కరుణించు
ధరను పాలించుచు ధర్మంబు నిలబెట్టు
పరిపాలకుల కెపుడు బాసటగ చరియించు
హరిపదాబ్జపు తేటి కంజలిని ఘటియించ
చిరయశముతో జనుల జీవితములు వెలుగు.//
