కలము - బలము
కలము - బలము
కలముఁ గనుగొన్న మానిసి క్షణములోన
వ్రాయ సాగెను తన కథ వైభవముగ
కథలు కబురులు కావ్యాలు కాలగతిని
బూర్జ పత్రాలపై నిల్చె పుడమి యందు.
బలము కల్గిన వారలు ప్రభువు లగుచు
కలము పట్టిన జాతికి గౌరవంబు
నొసగి పోషింప కవులెల్ల నుర్విపైన
వ్రాయ సాగిరి తమయొక్క ప్రతిభ జూపి
ప్రభుత చేసెడి తప్పులన్ ప్రజల కెపుడు
తెలియ పరుచంగ కవులకు విలువ పెరిగె
క్రూరమతులగు రాజులన్ గూల ద్రోయ
కలము మారెను పదునైన కత్తి వోలె
విబుధ వరులకు దొరికె నీ పెన్నిధి యన
వివిధ కాలము లందున పృథ్వి పైన
మార్పు చెందుచు లేఖిని మనుజ తతికి
బంధు వాయెను సతతము బలము నిడుచు
కాగితంబుపై వ్రాయగా కలముతోడ
జగతి యందున కార్యముల్ సాగుచుండు
నలువ రాణికి రూపమీ కలము యనుచు
ప్రాంజలింతురు ప్రజలెల్ల భక్తిమీర//
