కాగితపు పడవలు
కాగితపు పడవలు
చిరుజల్లులప్పుడే చిటపటా రాలాయి
మురిసిపోవుచు పల్లె భూములట తడిశాయి
నల్లనౌ మేఘాలు నలువైపులా చేర
చల్లనౌ వాయువులు సాయముగ వచ్చాయి
నెమలి బృందంబులట నెనరుతో నాడగా
సమతతో వృక్షాలు స్వాగతించేశాయి
వీధి గుమ్మాలకడ వేడుకగ నిలుచుండి
చిన్న పిల్లలు కలిసి చిందులేస్తున్నారు
కాగితపు పడవలను గబగబా చేయుచూ
వేగముగ నీటిలో విడిచిపెట్టేశారు
అదిగదిగొ నా పడవ అక్కడే ఉందంటు
ముదముతో పిల్లలట పొంగిపోతున్నారు
పళ్ళాలతో పునుగు బజ్జీలు పట్టుకొని
తల్లులా సమయాన తరలివచ్చేశారు
గోలచేసెడి చిన్నకుర్ర వాళ్లందరూ
చాలు నీ యాటలని చల్లగా వచ్చారు
చిరుతిండి తినుచుండి చెలిమితో మెలిగారు
మరికొంత సేపటికి మరల పరిగెత్తారు
వానమ్మ పిల్లలను వాత్సల్యముగ చూచి
కూనలను మురిపించ గొప్పగా కురిసింది.//
