సంతోషం
సంతోషం
గడప దాకా వచ్చి వెళ్ళింది
సాహసం చేసి బెల్ నొక్కలే, తలుపు కొట్టలే
ఇంటిల్లిపాది వాసన పీల్చింది, వాస్తవం గ్రహించింది
దుఃఖాన్ని సాగరం చేసే చోట తానెందుకని పోయింది
తలుపు తీసేసరికి వాకిట్లో రాలిన పూల సువాసన
సంతోషం రాకను ఖరారు చేసింది
గుప్పెడు కన్నీళ్లు దిగమింగుకొని
వెతికి వెతికి వేసారా కనిపించలే దరిదాపుల్లో
దుఃఖానికి చిరునామాగా మారిన చోట
పోతుంది ఆనందం ఆనవాలు లేకుండా
ఇంట్లో దుమ్ము, బూజు దులిపినట్లు
ఏడుపుగొట్టు తనానికి స్నానం చేయించా
ఏదీ పులుముకోకుండా స్వచ్ఛమైన నవ్వులు పారించా
బారా దర్వాజా ,ఖుల్లా చేసి చీకటిని పారదోలా
సమయం, సందర్భం మారడంతో
వెలుతురు సమీపంలోకి వచ్చి ఆవహించింది
ఇప్పుడింట్లో అలుముకున్న ప్రేమ ఆనందం
సంసారంలో సరిగమల గానం
తల్లెల నిండా పండిన హాస్యం కడుపులోకి
త్యాగాలు తపం చేస్తే ప్రశాంతత ప్రసన్నం
గేటుకు జాగ్రత్త కుక్కబోర్డు అవసరం లేదిప్పుడు
వాడకట్టంతా కలుపుకుంది కదా బంధుత్వం
