సంక్రాంతి సంబరం
సంక్రాంతి సంబరం
ప్రతి ఏడు లాగే వచ్చింది సంక్రాంతి
సిరులెన్నో కురిపించకపోయినా
సిరుల వంటి ఆనందాలను
మోసుకు వచ్చింది
రంగుల చుక్కల ముగ్గులతో
స్వాగతం పలుకగా
చుక్క చుక్కను కలిపినట్టు
చక్కని చిక్కని అనుబంధాలు
ముగ్గుల తీగలవోలె విడదీయరానివంది
కర్షకుని హర్ష మంతా
గంగిరెద్దుల కష్టమే నంటూ
మూగ జీవుల హితమే నంటూ
కనుమను కనమంది
హరిదాసుల దానం
పిడికెడు అన్నం
పదుగురికి పెట్టడమే పరమార్థమంది
భోగి పళ్ళు గొబ్బిళ్ళు చెరుకుగడలు
నువ్వుల అరిసెలు బెల్లం బొబ్బట్లు
కొత్తకొండ బియ్యం పొంగలి
భోగి మంటలు కొంటె సరదాలు
చలిని పారదోలే సంక్రాంతి సంబరాలు
వలస పక్షులన్నీ
సొంత గూటికి
చేరిన మధురక్షణాలు
తల్లి పిల్ల కలిసి సందడి చేసిన
పల్లెటూరి పరువాలు
ఆనందంతో గుండెలు
బరువెక్కిన భావన లు
వచ్చే సంక్రాంతి వరకు
ఈ ఆనంద గుళికలు
ఆస్వాదిస్తూ వీడ్కోలు పలికిన
చమరింత లతో
మరో ఏడు కై ఎదురు చూపులు
తనవారి రాకకై కలవరింతలు
