ప్రకృతి
ప్రకృతి
*ప్రకృతి*
(తేటగీతి మాలిక )
పుల్ల పుడకలు పట్టుచు ముక్కుతోడ
కొమ్మ లందున బక్షులు గూళ్ళు కట్టి
సేదతీరుచు గడుపునీ జీవితంబు
పులుగులన్ గాంచగన్ బహు ముచ్చటగును.
మత్స్యముల్ జల మందున మసలు చుండ
కళ్ళు త్రిప్పక మనుజులు కాంచుచుంద్రు
తరువులందున్న పూవులన్ దనివి తీర
కాంచు చుండగ మదినిండ కలలు వచ్చు.
మదిని గెల్చిన ప్రకృతియే మరులు గొలుపు.
చెట్టు పుట్టలన్ గొట్టుచు చేటు తెచ్చి
జీవరాశిని ధ్వంసము చేసి చేసి
భూత గణముకు తీరని ముప్పు తెచ్చి
కాల్చి వేయుచున్ భవితను గనులు మూసి
నాశనంబును జేయుచు నష్టపరిచి
మనిషి కోల్పోవు చుండెను మదిని శాంతి.
తరువు లేనట్టి దినమున ధరణి మునుగు
జలము లేనట్టి జగతిలో నిలువ లేము.
ముందు రాబోవు కాలము భువికి పెద్ద
కీడు తెచ్చునీ రీతిగా పాడుచేయ.
మనుజులందరున్ నిష్ఠగా మనసు పెట్టి
ప్రకృతి మాతను సేవించి వరల వలయు
జలము లందున్న మలినంబు తొలగజేసి,
చెట్టు పుట్టలన్ బెంచుచు జీవతతికి
మేలు చేసిన చాలును మిగులు భవిత.//
