ప్రియమైన శత్రువు
ప్రియమైన శత్రువు
నా వల్ల నువ్వు అమ్మ ఒడికి దూరం అయినా
అమ్మలా గుండెల్లో నన్ను దాచుకుంటావు
నేను పుట్టాక నాన్న గారం అంతా నాకే అయినా
నాన్న నన్ను తిడుతుంటే నన్నే నువ్వు వెనకేసుకొస్తావు
ఆటలు పట్టిస్తూ జడ రిబ్బన్లు లాగేస్తావు కానీ
పెరటిలో నా కోసం పూసే గులాబీని ఇంకెవరు కోసినా ఒప్పుకోవు
నాకు వయసు వచ్చాక నన్ను కుర్రాళ్ళు కన్నెత్తి చూస్తే గుర్రుగా చూస్తావు
నేను పుట్టకముందు నుంచే నీ కళ్ళూ మనసూ నా మీదేగా మరి
అత్తారింటికి పంపేస్తా అని నన్ను అల్లరల్లరి చేస్తావు కానీ
నీ కళ్ళల్లో దిగులుని మాత్రం దాచుకోలేవు
మళ్ళీ జన్మిస్తే నీ చెల్లిగా మాత్రం పుట్టాలనుకోను
నీకు జన్మనిచ్చి తల్లిగా నీ చేతుల్లోనే వెళ్లిపోవాలనుకుంటాను.