ప్రేమలేఖ
ప్రేమలేఖ
ప౹౹
అందుకున్నాలే ఓ అందమైన ఒక ప్రేమలేఖ
అందుకొని దాచుకొన్నాలే సంగతి చెప్పలేక ౹2౹
చ౹౹
ముద్దుగొలిపే ముత్యాల్ని పోలిన అక్షరాలు
సద్దులేని ఎలమితో మదిలో వలపుక్షీరాలు ౹2౹
పొంగిపొరలి వచ్చేనే ఎదలోని ఆ భావాలు
నింగిలోనీ మబ్బులని తాకిన అనుభవాలు ౹ప౹
చ౹౹
కలలోనూ వినిపించెనే కమ్మని సంగీతంలా
కలయికకోసం హృది మారాం చేసే గీతంలా ౹2౹
వద్దికగా ఒదిగినే లేఖలోని తీయని పదాలు
పొందికగా వినుపించే ప్రేమపక్షపు వాదాలు ౹ప౹
చ౹౹
కోయిల కొత్తరాగంతో ఉవ్వెత్తున కూసినట్లు
హాయిలా వింత పోకడ ఆమని కమ్మేసినట్లు ౹2౹
తనువు చలించెనే తన్మయత్వము పట్టలేక
అణవణవూ కదిలించెను ఆ నవ్య ప్రేమలేఖ ౹ప౹