ప్రేమ
ప్రేమ
వ్రాయరాని లేఖలాగ..మిగిలెనిపుడు ప్రేమ..!
నీ తలపుల సుమవనమై..దక్కెనిపుడు ప్రేమ..!
విరహపురుచి చూపేందుకు..చూస్తున్నది గాలి..
ఊపిరింటి దీపమల్లె..నిలిచెనిపుడు ప్రేమ..!
నిత్యచైత్ర సుధ చిందే..జాబిలి నీ మనసు..
అసలు చెలిమి వెన్నెలగా..కురిసెనిపుడు ప్రేమ..!
అరవిరిసిన కలువలేవొ..నీ కన్నులు గాక..
పరిమళించు మౌనముతో..పొంగెనిపుడు ప్రేమ..!
ప్రవహించే కాంతిపూల..నదివైతివి మదిని..
సిగ్గుపూల మేఘాలను..మీటెనిపుడు ప్రేమ..!
ఋతురాగపు మధురిమలకు..సాక్షిలాగ చెలియ..
మధుమాసపు సోయగమై..నిండెనిపుడు ప్రేమ..!

