ప్రేమ వేధింపులు
ప్రేమ వేధింపులు
తొలి మంచు కురిసింది
మేఘ సందేశాన్ని మోసుకుంటూ..
చెలియ మదిలో కోటి వీణలు మోగాయి..
ప్రియుడి రాకకు తరువులన్నీ తలలూపుతూ స్వాగతం పలికాయి..
పూల సుగంధం మోస్తూ వీచేగాలిలా మత్తుగా తాకుతూ..
గున్న మామిడి తోటలోని
గువ్వల జంట కువకువలు ఒయ్యారంగా పారేటి సెలయేటి గలగలలు వినిపిస్తున్నాయి
చెవులకు ప్రణయగీతంలా..
సహ జీవనమంటూ సరదాగా
మొదలై క్రమంగా
అనుమానం పెనుభూతమై చరవాణి సందేశాలు కాల్ లిస్ట్ తనిఖీలు
నీడలా అనునిత్యం వెంటాడుతూ
శల్య శోధనలు
చూస్తుండగానే కరిమబ్బులుగా మారిపోయింది ఆకాశం
ఆనందాల చెలి మోమున
ఆందోళనల ముసుగేసింది..
వీచే గాలులు రంపపు కోతలుగా ఆశల ఆకులను రాల్చేసింది
కురిసే వర్షం వరద గోదారిలా
అంతకంతకూ గుండెల్లో
గుబులు రేపుతోంది
ఎందుకో మనసు తలపున
కీడు శంకిస్తుంది
నీవు తుషారానివో తుఫానువో అని ఆనందపడే లోపే
ఆవిరి చేసేస్తూ ప్రళయం సృష్టిస్తూ
దగ్గరవుతున్న మనసును
ముక్కలు చేసేస్తుంటే
తట్టుకునే శక్తి లేదుగా
భిన్న మనస్తత్వాలు కలిగిన
నీ ప్రేమకు శాశ్వతంగా దూరం జరగడమే మేలని శెలవంటూ..!
