ప్రేమ(పాద)చిహ్నాలు
ప్రేమ(పాద)చిహ్నాలు
ఏకమైన అమ్మానాన్నల
ప్రేమహస్తాలదోస్తీకి గుర్తుగా
'పవిత్రమైన
ఆ అమ్మ అంతరంగాధరాల్లోంచి'
ఉదయిస్తున్న ఈ బుజ్జిపాదాలు!
జీవావిర్భావానికి సూచికలు!
ప్రేమపాదప్రతీకలు!!
ఎదురై వస్తోంది బ్రతుకువెల్లువ
ఎదురీదేందుకు దుస్సాధ్యంగా
ఇలాగోళాన్ని అన్నివైపులా వెతలఅలలతో చుట్టేస్తూ...
కుప్పలుతెప్పలుగా
కూర్చినప్రేమలతో
తెప్పలై కనురెప్పలై వస్తున్నాయ్
ఇవిగివిగో......
తలిదండ్రులఉమ్మడిగుండెలు
అడుగడుగున అండదండలై!!
పాపాయి జీవనపాదదీపాలు
ఆరకుండా చేరి నిలిచిన
చిట్టిచిమ్నీలై గట్టి కోటలై
అమ్మానాన్నల చేతులుంటాయ్
కన్నప్రాణాల భరోసలుంటాయ్
శైశవంలో నైనా
బాల్యంలోనైనా
యవ్వనంలోనైనా
వృద్ధాప్యంలోనైనా
మృత్యువే ఎదురైనా
కాపాడేందుకు సిద్ధమై....
కన్నమనసుల ఊపిరులుంటాయ్
కనిపెడుతూ కనుచూపులు ఉంటాయ్ !!