ప్రేమ లేఖ కాదు...
ప్రేమ లేఖ కాదు...
తెలియదు నాకు
మొయిలు జూచి
మయూరి ఏల నర్తించునో
తెలియదు నాకు
ప్రభాకరుని చూచి
పంకజము ఏల వికసించునో
తెలియదు నాకు
అవనిపై ఆకసానికి
అంత ప్రేమ ఏలనో
తెలియదు నాకు
జలనిధి కెరటాలు
జాబిలి జూచి
ఏల ఉప్పొంగునో
తెలియదు నాకు
నీపై ఏల అంత ' ఇదో '
తెలియదు నాకు ఆ ' ఇది 'అది అని!
అది ఆకర్షనో
అనురాగమో
ప్రేమో
మోహమో
మరేమిటో
తెలియ చెప్పకనే నాకు
నా హృది నీపై వాలింది
తడిమి చూడు నీ భుజంపై
ఓ చిలక తగులుతుంది
అదె నేను
నాకు ఎరుకే
పురూరవుడంతటి
అపురూప అందగాడివి కాదు నీవని
నాకు ఎరుకే
కండలు పెంచి
గోదాలో కుస్తీ పట్టు బలిష్ఠుడవు కాదని
నాకు ఎరుకే
మధుర గానాన్ని ఆలపించే
గంధర్వడవూ కాదని
నాకు ఎరుకే
పనికిమాలిన కవితలు వ్రాసే
ప్రసాదువూ కావని
నాకు ఎరుకే
అద్భుత ప్రజ్ఞా పాటవాలు
నీకు లేనే లేవని
అయినా ఏదొ తెలియని
ఇది నీపై
చిలుకను చేతబట్టి ముద్దాడుతావో
ముదిత తనంత తా చేయి చాపిందని
అలుసుగా తీసుకుంటావో!
ఔనంటే
నా జీవితం
నందనవనం!
అనురాగ సుధా కావ్యం!
కాదన్నా కన్నీరు కార్చే
కలికిని కాదు నేను
బ్రతిమాలి
పాదాలపై పడే
పాతకాలపు పడతిని కాదు నేను
కాకపోతే ఒంటరిగా మిగిలి పోతా
జీవితమంతా !
సమాజాన్ని ఎదుర్కొంటూ
కాకులను తోలుకుంటూ
నక్కజిత్తులకు పైయేత్తు వేసుకుంటూ
తోడేళ్ళ వేడి చూపులను తట్టుకొంటూ
ఇది ప్రేమలేఖ కాదు సుమా!
గంటంతో తాళపత్రంపై నే వ్రాసిన
విచిత్ర పత్రం!
... సిరి ✍️
