పరాభవ
పరాభవ
సమరవాంఛకు పరాభవమే..చేయవచ్చెను పరాభవ..!
అహంకారము బూదికాగా..చూడవచ్చెను పరాభవ..!
మనిషితనమే సంపదైతే..మనుగడెంతో మధురమే..
విర్రవీగే లక్షణాలను..దులపవచ్చెను పరాభవ..!
కాలయాపన చేయవలదని..సూచనేదో చేసెనే..
మౌనివరులను మాటలాడగ..తెలుపవచ్చెను పరాభవ..!
కలుషమతులను కాలరాసే..కాళిమాతయె చూడరో..
పుడమితల్లికి శాంతిగంధం..పూయవచ్చెను పరాభవ..!
పూలదారుల శంకరత్వం..పరచినవ్వే జాణయే..
వినయవీణా రాగఝరియై..పొంగవచ్చెను పరాభవ..!
ఎంత గర్వం ఏమి స్వార్థం..దురాక్రమణయె లక్ష్యమా..
మందబుద్ధుల వెర్రి కలలను..కాల్చవచ్చెను పరాభవ..!
