STORYMIRROR

murali sudha

Romance

4  

murali sudha

Romance

పీఠముడి

పీఠముడి

1 min
218

పీఠముడి....


నీకేదీ తిన్నగా చెప్పడం రాదుకదూ....

ప్రేమనూ,మోహాన్నీ, ఆరాధననూ, అభిమానాన్నీ అన్నీ ఎందుకో మరి వంకరగా చెబుతూ ఉంటావు, ఓరగా ఓ చూపు విసిరేసి నా చూపుల్ని చదివే పనిలో పడతావు, ఎందుకా లోపలిఆశల్ని కప్పేస్తూ పైకో నటనను ఒలికిస్తావు!? ఎందుకెప్పుడూ రుసరుసల పళ్లెంలోంచి మాటల్ని కొసరి కొసరి వడ్డిస్తావు......!?


     నువ్వేదో చెబుతావని చెవులు రిక్కించి మరీ వినే మనసుకు ఎప్పుడూ ఆశాభంగమే, పెళ్లున విరుచుకుపడే నీ మాటలతో దానికెప్పుడూ నిద్రలేని రాత్రులే, ఇన్నీ చూస్తున్నా ఆ కన్నులు మాత్రం ఏ కనికరం లేకుండా నీ కలలనే కంటూ మనసు జాగారాన్ని మచ్చుకైనా పట్టించుకోవు, కోరికల చిట్టాను కాటుకతో దిద్దుతూ తమ పనిలో తాము నిమగ్నమౌతాయి, నీ దృష్టిలో చులకన కాబడ్డ బాధ కేవలం నా మనస్సుకు మాత్రమే అంటగడుతూ దేహం కూడా నీ నీడలోకి చేరి హాయిగా కాలాన్ని వెళ్లదీస్తుంది.....


     ఇన్ని అక్కరలేని తనాలని నాకప్పగిస్తున్నా నీ మీదెందుకు ఇంకా ఈ తపన అంటే...... నువ్వుగా లోపలెక్కడో కొలువున్నావనే కదా అర్థం....!? నన్నుగా నీలో ఎక్కడో ఇముడ్చుకున్నావన్నదే కదా భావం....!?కానీ ఇది తెగని ప్రేమ దారమో, మరో మరో, మరో ముడితో పెనవేసుకుపోతున్న పీఠముడి బంధమో, రాబోయే రోజుల కాబోయే చరిత్రలే తీర్పులు.....కకావికలపు శూన్యపు యాత్రలే మన మజిలీలు.....


సుధామురళి


Rate this content
Log in

Similar telugu poem from Romance