పిచ్చి మనసే
పిచ్చి మనసే
విన్నపాలను ఆలకించగ..కోరుతున్నది పిచ్చిమనసే..!
విరహగీతిని విందుచేయగ..వేగుతున్నది పిచ్చిమనసే..!
ఎంతచిత్రం జ్ఞాపకాలే..గుండెకోసే కత్తులాయెను..
అంతుచిక్కని కడలిలోనే..మునుగుతున్నది పిచ్చిమనసే..!
వింతహాయిని మాయచేసే..గదినిఎట్లా కాల్చివేయుట..
గాలియాడక ఉడికిపోతూ..పొంగుతున్నది పిచ్చిమనసే..!
తలపుచాటున వెన్నెలమ్మే..దరికిరాదే తలనునిమరగ..
వెర్రియాతన ఓపలేకే..మరుగుతున్నది పిచ్చిమనసే..!
తోడుకోసం వెతుకులాడే..బుద్ధికన్నా శాపమేదో..
దిక్కుతోచని అడవిలోకే..తరుముతున్నది పిచ్చిమనసే..!
మోహమేదో వీడలేకే..పరుగుతీసే లేతవలపే..
రాగవీణా సుధలుచిందుతు..రగులుతున్నది పిచ్చిమనసే..!

