ఒంటరి జాబిలి
ఒంటరి జాబిలి
దురద్రుష్టం
ఎవరూ అతడు రాసింది చదవరు సరికదా
స్పర్శించరు
చాలామంది
అతడొకడున్నాడన్న విషయం దాచిపెట్టి
తెలియనట్టే
నటిస్తారు
అసమాన కవిత్వం రాస్తున్నాడని
అంతర్జాలం ఆశ్చర్యపడే ఆలోచనలతో
అవనిని కుదిపేసే ఊహలతో
ప్రకంపిస్తున్నాడని
అనిపించినా
పైకి మాత్రం
చలించరు
ఎక్కడో తోవలో ఎదురైతే
భుజం తట్టి బాగుందొయ్ అనేస్తూ
ముందుకు సాగిపోతారు
పాత వాసన కలుగుల్లోకి ఎలకల్లా దూరిపోయి
ముదురు చర్మాల కింద ముడుచుకొని
తాబేళ్ళలా నూతి నీళ్ళలో కదుల్తూ
ఆత్మానందం అనుభవిస్తారు
చాలామందికి అతడిని చూస్తే
కుర్చీ పోతుందనో
స్థానం చెదిరిపోతుందనో
కండువా జారిపడుతుందనో
భయం
కొందరు నోరు విప్పరు
అతని చిరునామాని చూసి
ఉప ప్రాంత సంపాదకులు
కవరునే చించరు
పోటీ ప్రపంచానిది
సర్వదా అతన్ని మాయం
చెయ్యాలనే ప్రయత్నం
పరదాల వెనుక దాచో
స్వీకారం శీర్షికన అతని రచన
ప్రకటించో
చీకటి నీడల దోబూచులాట లాడుతుంది
పాపం అతడొక అమాయక జీవి
రాజకీయాలు
పైరవీలు
తెలియనివాడు
ప్రభు సత్తాకుల చుట్తూ
ఆంగిక ప్రదక్షిణలు
మూకిక అభినయాలు
ఎరుగనివాదు
ప్రజల పక్షాన గుంపులో నిల్చొని
కోపంతో రాళ్లు రువ్వుతున్నవాడు
దేహమంతా గాయాలు
నిర్భీకి
ప్రజా ప్రియుడు
శ్రుంఖలాలను
కిలుము పట్టిన పాత డబ డబ శబ్దాలను
ఏవగించుకొనేవాడు
ఆ అగ్ని స్వరం ఎవరిక్కావాలి
ప్రచార యంత్రాంగం
నిర్ద్వందంగా అతన్ని తిరస్కరిస్తుంది
పాత వంట పాత్రలు తోమి తోమి
కడిగి కడిగి
తుడిచి తుడిచి
మడితో రోజూ తినే వంటకాలే
వండి వార్చి
మళ్ళీ మళ్ళీ వడ్డిస్తుంది
ఆ వంటే తినండి
అలవాటు పడినవారు కదా
ఆ రుచులే మీకు ఇష్టం మరి

