నవలను
నవలను
ప్రేమించే మనసుకొరకు..వెతుకుతున్న నవలను..!
నన్నునేను ఒకచరితగ..మలచుకున్న నవలను..!
గంధాలకు అతీతముగ..జన్మలెన్నొ గడిపితి..
మాతృత్వపు వెన్నెలనే..పంచుతున్న నవలను..!
పేగుబంధ సింధూరపు..మధురిమలో నుంటిని..
సంసారపు సరిగమలను..నడుపుతున్న నవలను..!
మాయంటూ ఏమున్నది..ఎఱుకతోడు అయితే..
ప్రశ్నించక మౌనములో..చేరుకున్న నవలను..!
యుద్ధమేది అయినాసరె..ఆటలాగ తలతును..
వీరతిలకమే నుదుటన..దిద్దుకున్న నవలను..!
చదివేందుకు పట్టుబడని..మహాకావ్య నాయికను..
సహనమనే నిధినిమదిని..నిలుపుకున్న నవలను..!

