నిన్ను నీవు
నిన్ను నీవు
నిన్ను నీవు అంతలా కాపాడుకోకు
పెనుగాలి తాకిడికి తట్టుకోలేవు
వానా వరదలొస్తే తడవక ఉండలేవు!
కన్నీళ్ళు ముత్యాలవంటివి రాల్చమాకు
పెదవులకి కొంచెం పని కల్పించు
పలుకుతూ పలుకరిస్తూ నవ్వి నవ్వించు!
వెన్నెల వెలుగులు తెచ్చి అద్దమనకు
మనసు మంచిదైతే ముఖమే వెలుగు
ఆత్మతృప్తి లేనిదే ఆనందంగా ఉండలేవు!
వ్యధలు నిన్నే అంటుకున్నాయి అనుకోకు
నీరెండవోలె వచ్చిపోతాయి నిమ్మళించు
సమయానికవే సర్దుకుంటాయి గమనించు!
ఎప్పుడూ నీగురించి మాత్రమే ఆలోచించకు
మనసిచ్చి పుచ్చుకోమని ఎవరన్నారు
చేతిలో చెయ్యేసి నువ్వున్నావన్న ధీమానివ్వు!

