నీవేమాంటావు
నీవేమాంటావు
ఎప్పుడు తనకోసం ఎదురు చూడడమేనా
నేను లేకుండా ఉండలేనని
రాకుండా ఉండలేడా..
నేను కోరితేనే నీ ప్రేమనా
నీకై నీవు స్పందించలేవా…
నేనేమైనా అడిగానా చంద్రున్ని
వెన్నెలను పంచమని
నేనేమైనా బతిమిలాడుకున్నానా
సూర్యున్ని తేజస్సు ఇవ్వమని..
నా గుండెల్లో ఉన్నావంటావు
నా గుండె లయ ఎందుకు
ఆరాటపడుతుందో తెలియదా..
తెలిసే నీకు అలుసయ్యానా నేను.
తోటలోని పూలన్నీ
నా సిగలోకి రావడానికి
ఎంతెంత ఆరాటపడుతున్నాయి
వాటికి ఎందుకు నేను అలుసు కాలేదు.
నీ మీద ప్రేమను చూసి
సమయానికి ఎందుకంత ఈర్ష
క్షణాలన్నీ యుగాలుగా
నా ముందు ఉంచుతుంది.
నీ రాకతోనే ప్రకృతి అంతా
ఎందుకు అందంగా కనిపిస్తుంది
హృదయ భారమంతా
ఎందుకు తేలిక అవుతుంది.
అద్దం ఎందుకు అలా నవ్వుతుంది
తనలో నేను చూసుకున్నప్పుడు
నువ్వు నేనయ్యానా నేను నువ్వయ్యావా
తనకి తెలియదా ఇద్దరం ఒకటే అని.
తలదిండు నువ్వే ఎందుకు అవ్వాలి
ఫ్యాన్ గాలి చప్పుడే నీ మాటలు ఎందుకు అవ్వాలి
రుద్దుకున్న సబ్బే నీవెందుకు అవ్వాలి.
నా ఊహల రూపం నీవైనందుక?.
రోజులు మాసాలు నెలలు సంవత్సరాలు
అన్ని కరిగిపోతూనే ఉన్నాయి
నాలో ఎందుకు
నీమీద ప్రేమ ఎక్కువవుతుంది ?.
ఊహలకు రెక్కలు వచ్చిన లాగున
మనసు తీసుకెళ్లిన చోటు కల్లా
నీతో కలిసి వెళ్లే రెక్కలు ఉంటే
ఎంత బావుండును…

