నీటి బొట్టు
నీటి బొట్టు
మట్టి కణం నెచ్చెలిగా మారుతోంది.. నీటి బొట్టు..!!
మబ్బు గుండె ప్రియ సఖిగా చేరుతోంది.. నీటి బొట్టు..!!
దాహాలను మోహాలను..చల్లార్చే యజ్ఞ సమిధ..!!
ప్రక్షాళన తన పనిగా..సాగుతోంది నీటి బొట్టు..!!
అందాలను తీర్చి దిద్దు అమృత ప్రేమ కరుణ రాశి..!!
పూవులలో మధువులాగ నిండుతోంది.. నీటి బొట్టు..!!
కన్నులలో ఆనందం..ఎదలోపల విషాదాలు..
పోషించే సాక్షి ధనం..నింపుతోంది.. నీటి బొట్టు..!!
స్వేదాలను ఖేదాలను తొలగిస్తూ లాలించగ..
సరిగంగగ అందేందుకు దూకుతోంది.. నీటి బొట్టు..!!
ప్రాణధార నిలిపేందుకు తపము సలుపు ననుక్షణము..!!
తాను మరిగి ఇగిరి ఎగిరి జారుతోంది.. నీటి బొట్టు..!!
నిజ హంసల జల క్రీడకు తన ధర్మము తప్పకుండ..
శ్వాసదీప కాంతులలో నవ్వుతోంది నీటి బొట్టు..!!
