నీ సన్నిధి చెలీ
నీ సన్నిధి చెలీ
నీ సన్నిధి హేమంతపు చంద్రికలా ఉంది చెలీ
మంచుపూల సుగంధాల తెమ్మెరలా ఉంది చెలీ
నీ కౌగిలి నులివెచ్చని జాతరలా ఉంది చెలీ
ఆవిరులకు యిష్టమైన వేడుకలా ఉంది చెలీ
అధరాలకు అధరాలను ఎలా నివేదించావో
తేనెపూలతో సలిపిన అర్చనలా ఉంది చెలీ
నను తలవని రాత్రివేళ బాగుందని చెప్పవద్దు
నిను తలవని రాత్రివేళ బాగుందని చెప్పలేను
ఒకో కన్ను విరబూసిన మంకెనలా ఉంది చెలీ
గుండెలపై చేతి స్పర్శ అద్భుతాలు చేస్తున్నది
గాయాలను మాన్పుతున్న మూలికలా ఉంది చెలీ
నువు రాసిన మొదటిలేఖ మరోసారి కనబడింది
వలపులతో ముంచుతున్న వెల్లువలా ఉంది చెలీ
చూపులతో నీ తనువును చదివినపుడు
మన్మథుడే ముద్రించిన పత్రికలా ఉంది చెలీ

