నీ మౌనం ఏలానో
నీ మౌనం ఏలానో
సంధ్యారుణ రాగాలను..పరుస్తోంది నీమౌనం..!
నా లోపలి విశ్వాలను..చూపుతోంది నీమౌనం..!
సాక్ష్యమెలా చూపగలను..ఎదకుదిపే స్వరవృష్టికి..
శ్వాసవీణ దారాలను..మీటుతోంది నీమౌనం..!
గుండెచాటు గాలులతో..సల్లాపము లాడేవా..
చైతన్యపు మేఘాలను..పిలుస్తోంది నీమౌనం..!
కాసులతో తూచలేని..సంపదలే కురిసేవా..
చేమంతుల హాసాలను..నింపుతోంది నీమౌనం..!
చిగురాకుల పల్లకిలో..వసంతాల సంబరమే..
అక్షరాల విరహాలను..తరుముతోంది నీమౌనం..!
చెలిఅందెల రవళులింటి..నాదమదే మనోహరం..
ప్రాణదీప శిల్పాలను..కుదుపుతోంది నీమౌనం..!

