నీ గుండెను
నీ గుండెను
దివ్యప్రేమ వాహినిగా..తెలిసిచూడు నీగుండెను..!
శాంతిపూర్ణ కుంభమదే..ఆగిచూడు నీగుండెను..!
నీతులేవొ ఎన్నైనా..చెప్పవచ్చు ఎవరైనా..
చెలిమిపూల తోటలాగ.. పెంచిచూడు నీగుండెను..!
ఎవ్వరేమి వ్రాస్తేనేం..ఆచరించి చూపిరేమి..
కరుణపూర్ణ మేఘంలా..తలచిచూడు నీగుండెను..!
పంచదగిన ధనమంటే..ఆత్మీయత ఓనేస్తం..
చైతన్యపు తీర్థమదే..తఱచిచూడు నీగుండెను..!
ప్రాణదీప రహస్యాల..ఆలయమది ఇంకెక్కడ..
నిర్నిద్రాంకిత తపస్వి..నిలిచిచూడు నీగుండెను..!
జననమరణ చక్రాంకిత..నిత్యరుధిర వాటికయే..
వాంఛాసుమ రాశిసాక్షి..సరసిచూడు నీగుండెను..!

