నేను
నేను
అందరిలాంటి వాడినే
సందు దొరికితే సంకలో
పిల్లి లా కాస్త లౌక్యం అలవర్చుకున్నవాడినే
రెండు నాలుకల సిద్ధాంతానికి
సౌమ్యుడు అని పేరు పెట్టుకున్న
మంచివాడినే
నేను అందరిలాంటి వాడినే
అసహనం చిరాకు అహం
ఆవహించినప్పుడల్లా
నాలోని పురుషాధిపత్యానికి
ఏమే, ఒసే అనే దురుసు మాటలతో
ఆజ్యం పోసిన వాడినే
విచక్షణ రహితమైన
నా యవ్వనపు చూపులతో
మగువ మనసుకు
సూదులు గుచ్చిన వాడినే
నేను
అందరిలాంటి వాడినే
న్యాయం ధర్మం పాపం పుణ్యం
తప్పు, ఒప్పులు
మంచి చెడు అంటూ
వేదాంతం నీతులు వల్లీస్తూ
పక్కోడి పెళ్ళానికి
ప్రణయ పాటలు నేర్పే వాడినే
నేను అందరిలాంటి వాడినే
సత్య హరిచంద్రుడికి తమ్ముడిగా
పోజు ఇస్తూ నారధుడికి రాయబారిగా
గోడ చాటు ముచ్చట్లకు చెవులప్పగిచ్చి,
మంది కొంపల్లో తలదూర్చి
నిప్పులు చెరిగి వినోదం అనే
అపహస్య వికృత క్రీడా స్ఫూర్తితో
మంది కన్నీళ్లతో
దాహం తీర్చుకునే వాడినే
నేను అందరిలాంటి వాడినే
నీతి నిజాయితీలంటూ లెక్చర్లు దంచి
భుజాలు తడుముకొని
బల్ల కింద చేతులు చాపి
సెకండ్ సెటప్కి కంచి పట్టు చీరలుచుట్టి
కొప్పునిండా మల్లెలు కూర్చి
మహిళా సాధికారత అంటూ నినాదించే
అభ్యుదయ భావజాలినే
నేను అందరిలాంటి వాడినే
నెయ్యిలో కూడేట్టి పియ్యిలో
లెక్కించే ఆర్థిక గణిత నిపుడినే
సాయ సహకారాలు అంటూ
నిత్యం మందిని యాచించి
పిల్లికి బిక్షం పెట్టని మహానుభావుడినే
నేను అందరిలాంటి వాడినే
మీలాంటి మనిషినే అందుకే క్షమించమని
పదే పదే సిగ్గు పడుతున్న
అంతరాత్మను వెలివేసి బ్రతికిడుస్తున్న
బతకలేక చస్తున్నా సస్తూ బతుకుతున్న
తూ ఈ బతుకు మీద గాండ్రించి
ఉమ్మి ఉమ్మి ఉచ్చ పోయా
అంటూ ఉచ్చయా శాస్త్రం లిఖిస్తున్న...!!
