నడిచే నీడలా
నడిచే నీడలా
ముసురుపట్టిన
మేఘంలాంటి మనసుండాలి
ఇక్కడ ఒంటరిగా
విరిగిన స్వప్న శకలాలకు
నడిచే నీడల సాక్షిగా...
పలచబడిన అడుగుల తడబాటులో
దుఃఖధార రాత్రుల్ని
కౌగిట్లో అదిమి పట్టుకుని
గుండెలోని ఖాళీని తడిమాను..
కాలం ఒడ్డున
సముద్రపు అలల హోరులాంటి
పాత గాయమొకటి
మళ్ళీ పలకరించింది
గతం నుదిటిపై పెట్టిన ముద్దులేవో
గాయపడి ఉంటాయి
మమతలు తడిమిన తడి
రాత్రి లోతుల్లోని
నిశి రంగుల్లో మళ్ళీ కరిగిపోతుంది

