నా ప్రాణ బంధమా
నా ప్రాణ బంధమా
నువ్వొక్కడివే పచ్చటి నేల తివాచిపై పడుకొని ఆకాశంవైపు చూస్తుంటే , ఆర్తిగా నా మనసంతా కరిగి ముత్యపు చినుకులా జారి నీ నుదుటిని ముద్దాడనా మనస్సులో బాధనో, మనిషితో బాధనో , వివర్ణమైన
నీ ముఖారవిందాన్ని , చల్లటి పిల్లతెమ్మరనై ప్రేమగా నిను చుంబించనా , నీ తనువంతా పరవశించే పరిమళాన్నై నిన్ను చుట్టేయనా
తొలి సంధ్యలో విడివడని నీ కమలాక్షువులను నునువెచ్చని అరుణ కిరణాన్నై తాకి , నిను సుతిమెత్తగా మేల్కొల్పనా
సముద్రపు అంచున నడిచే నీ పాదాలను అలనై అహల్యనై తాకనా, నీకై తరించిపోనా, నీతో బ్రతికేందుకై తపించిపోనా
ప్రశాంతంగా నువ్వున్న తరుణాన నీ మనస్సు తట్టే తలపుల ఘోషను ఆలకిస్తే, అనుక్షణం నలిగే నీకై , తపించే నా హృదయ లయల శబ్ధ తరంగమై
నీ మనస్సును చేరనా
కలనైనా నిను వదలలేని నా ప్రాణం , ప్రకృతితో కలిసి నీ చుట్టూనే పెనవేసుకొని ఉన్నా , ఒక్కసారి మనస్సులో ఐనా నను ప్రేమించానని చెప్పవేం
నా ప్రాణం బంధమా నా ప్రేమ సాక్షిగా ఈ పంచభూతాల్లో
ప్రశాంతంగా కలిసిపోనా..!!

