నా లోకం ఏదంటా
నా లోకం ఏదంటా
కళ్ళల్లో కాపురమున్న నీవు
వినీ వినపడనట్లు వీడ్కోలు చెప్పి
కనరాని ... నే కనలేని చోటకి
కదిలివెళ్ళావు నిశ్శబ్దంగా
నీవే లోకమైన నన్ను విడిచి
నీ స్మృతులేవీ లేని నిశ్శేషంగా
ఖాళీ అయిన నా కళ్ళలోకి
ఏవేవో చోటుచేసుకుంటున్నాయిపుడు
పరిచయాలు
బంధాలు వేసుకుంటుంటే
అనుబంధాలు
పరిచయం చేసుకుంటున్నాయి
కొత్తగా కాదు ...
బతుకు మందసంలోని
జ్ఞాపకాల లక్కపిడతలను
బయటకు తీసి మరీ...
ఒక్కొకటిగా లెక్కపెడుతూ
చెట్టూ పుట్టా ... మట్టీ చెరువుగట్టూ
గొడ్డూ గోదా ... గుడీ గోపురం
ఇల్లూ వాకిలీ ...మందీ మార్బలం
కళ్ళలోని ఖాళీల్లోకి సర్దుకుంటున్నాయి
ఇరుకేమీ లేకుండా ...
మనసులోకి జారి చేరుకుంటున్నాయి
సున్నితంగా సౌకర్యంగా
అయితే
నాకర్థం కానిదొకటే
నన్ను పలుకరించి వెళ్ళేవాళ్ళందరూ
"హమ్మయ్య !
లోకంలోకొచ్చేసాడు వీడు" అంటూ
అలా హాయిగా నిట్టూర్చడమెందుకో
