మట్టిపువ్వు
మట్టిపువ్వు
ప్రేమమధువు ఒలికిస్తూ..నవ్వుతోంది మట్టిపువ్వు..!
తీపివలపు పాటసాక్షి..మిగులుతోంది మట్టిపువ్వు..!
చినుకుపూల ఎదలోయల..చేసెనెన్ని సంతకాలొ..
సిగ్గులింటి వెన్నెలలే..పంచుతోంది మట్టిపువ్వు..!
కథలెలాగ చెబుతుందో..మొగ్గతొడిగి తొడగగనే..
మౌనానికి మాటలేవొ..పొదుగుతోంది మట్టిపువ్వు..!
మెఱుపులింటి వయారాలు..దోచుకునే జాణతనే..
మాయలోన తేలిస్తూ..ఇగురుతోంది మట్టిపువ్వు..!
విర్రవీగు గుణములేని..వేదాంతము విందుచేయు..
కాలానికి గులామగుచు..రాలుతోంది మట్టిపువ్వు..!
మన ఎఱుకనె కోలుపోక..జ్ఞానమెంత ఇచ్చేనో..
జన్మ ధన్యమయే తీరు..నేర్పుతోంది మట్టిపువ్వు..!
