మరో సూర్యోదయం
మరో సూర్యోదయం
మట్టమనిషిని అతడు
తీరని కరువు వెంటాడినా
వీడని వెతలు వేసారినా
హలం పట్టిన హస్తం
కాయలు కాచినా
నెర్రలిచ్చిన నేలమ్మను
ముద్దాడిన పాదాలు
బొబ్బలే వేసినా
చినుకమ్మ దయ లేకున్నా
గంగమ్మ తల్లి కన్నెర్రజేసినా
కష్టాల కడలికి ఎదురీదినా
అన్నదాతను అప్పులే మింగేసినా
కారే కన్నీళ్లు పారే పిల్లకాలువ
కాలే కడుపు కోతను తీర్చునా
అయినా చావని ఆశల రెక్కలు
స్వప్న సౌధాలలో వాలి
సేదతీరుతాయి
మానని గాయాలకు
మరపు మందు పూస్తాయి
జీవన సంఘర్షణలో కూడా
పదుగురి ఆకలి తీర్చాలన్న తపనతో
తనను తాను కాలం మరమ్మత్తులో
కలిసిపోయి
మరో సూర్యోదయంలా
వెలుగుతాడు నిత్య నూతనంతో
