మనసులో
మనసులో
మనసుమంట లార్పివేయు..నీరున్నది మనసులో..!
బుద్ధికింత బుధ్ధి నేర్పు..నేర్పున్నది మనసులో..!
వాడిపోని వసంతాల..వనమేదో తెలియవా..
మనిషితనం ప్రసాదించు..మధువున్నది మనసులో..!
చిరుగాలికి అల్లాడే..చిగురుటాకు ఉండునా..
కాలానికి ఎదురీదే..బలమున్నది మనసులో..!
కలతపడే పనేముంది..అంతరావ బోధనకు..
శిరసువంచి చెవినొగ్గే..గుణమున్నది మనసులో..!
పెదవిచివరి నవ్వులతో..పలకరింపు దేనికో..
ముసుగులన్ని వదలగల్గు..వెలుగున్నది మనసులో..!

