మనోహరం
మనోహరం
మందారం విడిగినట్లు మోదుగ విరబూసినట్లు
రవికిరణం సోకగానె కమలం విప్పారినట్లు
సింధూరపు చీరచుట్టి సింధూరము నుదుటబెట్టి
ఏకాంతము ఈకాంతా నను కలవాలని వచ్చెనె
ననుచూసిన కన్నులలో వెన్నెలెంత కాసిందో
ఆకన్నుల దారులెంట వేగంటినగరిని గంటి
ననుగాంచిన తక్షణమే సిగ్గుపూలు మొగ్గలేసి
ఎరుపెక్కిన బుగ్గల్లోన తీపిబూరెల నేగంటి
ముక్కుపుటాలదరుతుండ నిక్కబూనె నాసికయే
భావనలా మాధుర్యము మోవిపై తేనియలాయె
పిల్లగాలి చల్లగ వీచి కేశముల రేపుచుండ
తననిగనిన నాయుల్లము గగనసీమ పతాకమే
ఎదపొంగిన ఆనందం ఎదపొంగుల బిగువుజూపె
భారమైన సంతోషం కనురెప్పల వాల్పుజూపె
నీ నవ్వుల నయగారం నీసొంపుల సింగారం
మణిద్వీప వర్ణనయే సిరులిచ్చే సౌభాగ్యమె

