మిత్రుడొక్కడు..
మిత్రుడొక్కడు..
తలుపులన్నీ మూసుకుపోయిన వేళల్లో
తలపులన్నీ వాడిపోయిన వేళల్లో
ఆయువు లెక్కెడుతూ వేధించే క్షణాల మధ్య
వేలుపట్టుకు నడిపించే మిత్రుడొకడు కావాలి
దారులన్నీ దారుణ బుణపాశాలైనవేళ
బారులుతీరిన కష్టాలు భయపాశాలైనవేళ
ఎడారి గుడారమై విరులూ ఝరులూ విలపిస్తున్నవేళ
దయచూపే బాంధవుడిలా మిత్రుడి చూపొకటి కావాలి
కలలూ కాంతులను చిదిమేసే పరుగుల ప్రపంచంలో
విలవిలలాడుతూ వెలిసిపోయిన జీవితాలు
సంకుచితమనుషుల చీకటికురుల్లో చిక్కుకుంటే
చిక్కుతీసే దువ్వెనలాంటి మిత్రుడి నవ్వొకటికావాలి
బతుకు ఆత్రాన్ని పరిహసించే చలి రాత్రుల్లో
తీరని బాకీలాంటి బాధ్యతలు గడ్డకట్టిస్తుంటే
బంధాల మోపును ఆశల క్షణాలతో చుట్టగలిగే
ఉషోదయంలాంటి మిత్రుడి స్పర్శిప్పుడు కావాలి