మేఘరాగ రంజిని
మేఘరాగ రంజిని
సడే లేని మల్లెవాన..కురుస్తూనె ఉన్నది..!
మది మదిలో జగడమేదొ..మిగులుతూనె ఉన్నది..!
తన ప్రాణం తన ప్రణయం..అల్లుకున్న సమయం..
ఘన చరితా శిల్పాలుగ..మారుతూనె ఉన్నది..!
తన నవ్వే పరిమళించు..మధురభావ గీతం..
మైమరపుల తోటలోన..నిలుపుతూనె ఉన్నది..!
విరహమనే పంజరమే..వింత ఆలయమాయె..
దేవేరిగ నా మనసును..ఏలుతూనె ఉన్నది..!
అప్రమేయ ప్రమేయమే..ఈ మాయా వాహిని..
కడవలలో తన ఉనికిని..చాటుతూనె ఉన్నది..!
మనసుకి తెలియనిదా..తన అందెల సవ్వడి..
మేఘరాగ రంజనిగా..వెలుగుతూనె ఉన్నది..!

