మానునా
మానునా
ముళ్ళున్నాయని భయపడి గులాబి మొగ్గలు పూయుట మానునా!
రాళ్ళున్నాయని అల్లరి చేసే ఏరులు పారుట మానునా!
సుధగా నమ్ముతు విషాలు మింగగ మతిభ్రమించెను మనిషికే!
చేదూ వగరుల మేసెటి కోకిల తీయగ కూయుట మానునా!
కత్తులు నూరుతు ఎన్నాళ్ళనిలా భయపడి పోతూ బతకటం!
బురద గుంటలో బతుకని ముడుచుకు.. పద్మం విరియుట మానునా!
లోక మడ్డుపడి కంటిన చెమ్మగ మారెనుగా చెలి బింబమే!
మధురస్మృతులై గంధాలు పంచు గతాన్ని తలచుట మానునా!
సుఖ పంజరాన చిక్కిన శుకమే మరచును సహజపు పలుకులే!
వేదనాగ్నికీ విరహజ్వాలకు గజళ్ళు వెలుగుట మానునా!
మాయలు నేర్చిన ఎండమావులకు కొదువేలేదీ లోకాన!
అనుభవ జ్ఞానం చూపు తోవలో ముందడుగేయుట మానునా!
.. సిరి ✍️❤️

