సోపతి ...
సోపతి ...
చెలిమిలో ఏం మాయ ఉందో చెప్తారా ఎవరైనా
ఎంత తవ్వినా తరగని బంగారు గని అది
ఎంత ఎగిరినా అందని ఆకాశమంత ఎత్తు అది
చెలిమి చేయూతలకు కొలమానాలుండవు
చేసినవేవైనా చెప్పుకోవు బయటకు
మామూలుగా పావుగంట నిలబడే
నిలకడలేనోళ్ళం
గంటైనా గడియలా కరిగిపోయినట్లుంటది మాటల్లో
సమయం ప్రాణవాయువు పీల్చినట్లుంటది
చెలిమి చేయి పట్టుకొని నడుస్తుంటే
దూరం చిన్నబోయి వెనక్కి చూసుకుంటది
కాలాన్ని జయించినట్లుంటది
హోటల్లో రెండు నిమిషాలు టీ తాగితే
అరగంట సేపైనా టేబుల్ ముచ్చట్లు తింటది
పర్సులు బరువు తగ్గడానికి పోటీ
చెలిమి అన్నీ తెలిసిన గారడిది
ప్రాణప్రదంగా చేసుకుంటది
దాని కనికట్టు ముందు ప్రాణాలివ్వడానికీ సిద్ధం
చెలిమి కానుకలకు విలువ కట్టలేం
చిన్నదైనా చితకదైనా అందులో దాగుంటది ఆత్మ
కృష్ణ కుచేలుల సోపతి గొప్ప కథ
చెలిమి మధ్య దాపరికాలుండవు
దాన్ని సొమ్ము చేసుకునే వాళ్ళు నిజమైన శత్రువులు
సోపతి గాళ్లు వెన్నుపోటు పొడిస్తే చెప్పలేని బాధ
జేబు బరువు చూసి చేసే సోపతి నక్క వినయం
సోపతి తొవ్వ నాశనం సామెత కారాదు వాస్తవం
కింద పడితే చేయందించేది
చీకట్లో కందిల పట్టుకొని నడిపించేది
ఆపదలో, ఆనందంలో తోడుగా నిలిచేది
మట్టిని సేంద్రియ ఎరువులా ఆదుకునేది
చెలిమి అందించే అరుదైన కానుక
జీవుల మధ్య చెలిమి ఎలా ఏర్పడుతుందో
కలుస్తాయి మనసులు బంధువుల కన్నా మిన్నగా
మనుషులెంత దూరంగా ఉన్నా తరగదు ఆత్మీయత
బాల్య స్నేహాలు కలిస్తే మురిపాలు, పరవశాలు
జ్ఞాపకాల పెట్టె తెరుచుకుంటుంది ఎన్నేళ్లయినా
గతం గుండె గంటలు మోగుతాయి మధురంగా

