జరగదోయి
జరగదోయి
ఆలోచన సాక్షిగాక..ఎదగుటయే జరగదోయి..!
గురుతత్వం బోధపడక..ప్రేమలోతు చిక్కదోయ..!
పాత్రలోన జీవించే..ఎఱుకెవరో ఇవ్వరు మరి..
శ్వాసమాటు చేరకున్న..సత్యమింత వెలగదోయి..!
కోటిప్రభా భాసమాన..ఆదిత్యులు కలరులోన..
కన్నులింట నిలువకున్న..జ్ఞానమింత కలగదోయి..!
మౌనముతో మాటలాడు..విద్యకన్న విద్యలేదు..
అంతరంగ గ్రంథమాల..చదవమంటు చెప్పదోయి..!
వినేగుణం మించిలేదు..వినయమేదొ వేరేగా..
నీ సహనం ఎన్నటికీ..నిను చులకన తలచదోయి..!
దృష్టి లోపమే గానీ..సృష్టిలోన లేదు లోటు..
ఆలస్యం ఏమి లేదు..తొందరసలు కూడదోయి..!
