ప్రియతమా
ప్రియతమా
ఉన్న జబ్బుఒకటె ఓర్వలేనితనము..
మందులేని వ్యాధి మహిని చూడ..
మనిషితనము తెలుప మాటకు సిగ్గోయి.!
మనసు పెట్టి వినుము ప్రియతమా
మిన్నకుండు టెఱుగ మిన్ను మన్నులు తోడు..
మిథ్యయైన జగతి మేలుచేయు..!
సకల ఔషధములు శ్వాసమాటున కలవు.!
మనసు పెట్టి వినుము ప్రియతమా
నాకు తెలుసునన్న నవ్వేను నా'నేను'.!
తెలియదన్న చాలు తెల్పుచుండు..
పలుకుపలుకు లోన పరిమళములు నింపు..!
మనసు పెట్టి వినుము ప్రియతమా
పెంచుకొనుము కృషిని వేదవిద్యను నేర్వ.!
గొప్పతనములెల్ల గొడవలేను..
గుండె లయల మాటు గురువేర సత్యమ్ము.!
మనసు పెట్టి వినుము ప్రియతమా
చెఱువులోని నీరు చేరదు నీ దరి..!
కడలిదరిని చేరి కలలు ఏల..?!
నవ్వుపూల నదిని నాటకమే జగతి..!
మనసు పెట్టి వినుము ప్రియతమా
తనను తిట్టుకొనుట ధర్మహాని యగును.
పరుల తిట్టు పనియె పాపమనగ..
తెలియనట్టి దాని తెలిసినట్లేలరా..!
మనసు పెట్టి వినుము ప్రియతమా
పలకరించు గాలి పద్యమై గీతమై..!
వచన గేయమయ్యు పరిమళించు..!
కురియు కాంతి సాక్షి కూర్చుండు టెఱుగంగ.!
మనసు పెట్టి వినుము ప్రియతమా

