ఓ నేస్తమా
ఓ నేస్తమా
నిస్వార్ధపు ప్రేమకొరకు జగమంతా వెదకాలి
చల్లనైన చెలిమికొరకు మనసంతా పరవాలి "
పలుకు తేనె లొలుకు తెలుగు మరువనేల బాలలార..
అమ్మ భాష లోనె ఇంక చదువంతా వెలగాలి..!
యాబదారు అక్షరాల తెలుగులోని సౌలభ్యత..
గుర్తించగ..మది పొలముల కలుపంతా తొలగాలి..!
ఇంటిలోన తల్లి తండ్రి తక్కువగా భావించక..
తెలుగు సొగసు లందించగ కలతంతా తొలగాలి..!
చెలిమి కొరకు మనసు నిలుపు మనుషులెవరొ..
తెలుసుకొనగ అడుగులిడగ తలపంతా పొంగాలి..!
జాబిలితో ఆటలాడ కలుగు హాయి తెలుపుటెలా..
అక్షరాల వెన్నెలలో సొగసంతా తడవాలి..!
ఆమె నవ్వు వెల ఎంతో.. గగనానికి తెలిసేనా..!
కోటి మెరుపు పూల తెలివంతా ముడవాలి..!!
గురు పీఠం ఎక్కేందుకు గొడవెందుకు ఓ నేస్తం..
శిష్యుడిగా ఉండేందుకు మనసంతా పెట్టాలి..!
శిష్యుడుగా ఎదుగుదలను సాధించగ తపము వలయు..
అడ్డు తగులు ముచ్చటైన అహమంతా కాలాలి..!
సిగ్గు పూల వెన్నెలలో జలకమాడు ఓ చెలియా..
ఎల్లపుడూ ఇలా నీదు తలపంతా మురియాలి..!
'కనులు తెరిచి కలలు కనుడు సెలవు లేక పనిచేయుడు..'
మన 'కలాము' వాక్కు లోతు మనమంతా తెలియాలి..!!
ఎన్నికలకు నాయకులే దిగి వత్తురు మన చెంతకు..
ఓటు విలువ తెలుపుటకే మనమంతా కలవాలి..!
భారత మాత ముద్దు బిడ్డ 'కలాముజీ' ఆదర్శం..
ఆచరించ శ్వాస సాక్షి మనమంతా నిలవాలి..!
గౌరవాల గౌరవమే ఇనుమడించె' కలాము' తో
ఆ ప్రతిభా కేతనమే మనమంతా నిలపాలి..!!
నిదురోయే వాగమ్మను ఎద మీటును వెన్నెలమ్మ..
ఆ రెండిటి సమాగమం వలపంతా నిండాలి..!
ప్రతి రాత్రీ చుక్కలమ్మ పాలపుంత లాలించును..
ఆ హాయిని నులివెచ్చగ జగమంతా అందాలి..!!
చెరిగి పొని.. కరిగి పొని.. తరిగి పొని..వందనాలు..
'కలాము'జీ పని తీరుకు మనమంతా చేయాలి..!!
కులాతీత మతాతీత జాత్యతీత ప్రేమ తోటి..
ఆత్మీయత కురిపించగ కవులంతా కదలాలి..!
లేదు తావు కోపాలకు తాపాలకు..మైత్రీ సుధ..
లోకాలకు పంచేందుకు బ్రతుకంతా పెట్టాలి..!
పుష్కరాల గోదారికి వన్నెకూర్చు స్నానమేదొ..
తెలిసేందుకు మౌనంగా మనమంతా ఎదగాలి..!!

