ఒక్కసారి ఇటుచూడు
ఒక్కసారి ఇటుచూడు
ఒక్కసారి ఇటుచూస్తే..నీ సొమ్మేం పోయేనట..!
పూలరుతువు నీచూపే..అలుకలేల చిమ్మేనట..!
తెలియకనే అడిగేది..పెదవి కాస్త విప్పవచ్చు..
నాపై దయ చూపకున్న..లాభమేమి కలిగేనట..!
సిగ్గెరుగని విరహముతో..పోరుసలుపు పనేమిటో..
అరకందిన చెక్కిలింటి..పంటకు తడి చిక్కేనట..!
నవ్వుపూల వీణియవే..సరాగాల విందెప్పుడు..
ప్రశ్నించే మనసుకింత..శాంతి ఎపుడు దక్కేనట..!
చెలివలపుల కోవెలలో..ప్రేమదీప తోరణమే..
చీకటెలా ఉంటుందో..వెలుగుకెలా తెలిసేనట..!
మోహానికి దాహమెంతొ..దేహానికి బోధపడును..
తనువు మాటలాడు భాష..తగవులెల్ల తీర్చేనట..!

