వాలని రెప్పలు
వాలని రెప్పలు
నా కలలను నిజంచేయ..దిగివచ్చెను చెలియ..!
కలకాదని తెలియులోపు..మాయమయెను చెలియ..!
ఈ వాలని రెప్పలతో..కలహించగ లేను..
కనులుతెఱచి కలగనుటకు..వరమిచ్చెను చెలియ..!
ప్రేమపేర జరుగుతున్న..నాటకమీ జగము..
తెఱవెనుకే తానుంటూ..బోధించెను చెలియ..!
"చివరిశ్వాస గూర్చెందుకు..ఆలోచన అసలు"?!..
కనుజారని అశ్రువునే..ప్రశ్నించెను చెలియ..!
రాలేందుకు బాధపడే..చినుకన్నది లేదు..
ఆనందపు చిరునామా..అందించెను చెలియ..!
చెప్పలేని భయమేదో..ఎదలోయల ఉండె..
ఒక తియ్యని నవ్వురువ్వి..తొలగించెను చెలియ..!

