బిగబట్టినా కన్నీరు
బిగబట్టినా కన్నీరు
కనులేమో చెప్పాలనుకుంటున్నాయి
మది మధించిన కలతలను విప్పుతూ
యంత్రంలా తయారైన మనిషికి స్వప్నంగా
విరాగి అయిన మనిషికి వాస్తవాలను చూపేందుకు..
తియ్యటి బాంధవ్యపు రోకలి పోటులో
అనుబంధాల మెరుపుతీగలను చుట్టి
తనువుకు రక్త బంధాన్ని ముడి వేస్తూ
నర నరాల్లో ధన ప్రవాహం ఎక్కుతూనే ఉంది...
పెదాలపై చిరునవ్వు ముద్రలు నలుపెక్కి
మనసు గోతిలో మాలిన్యము నిండుతుంది
చల్లని చూపుల్లో కామపు వర్షం కురిపించి
తనువులకు సూదులు గాయాలు పండిస్తున్నారు..
ఆకలి చేసే అరాచకం నృత్యం చేస్తుంటే
రుధిరపు పిడికిళ్ళు వెతుకులకై ఏడుస్తుంటే
న్యాయ అన్యాయపు చట్టాలు లెక్కలు వేస్తుంటే
అపవిత్రము కాని దేహము నిందలు వేస్తుంది..
కడుపు వెన్నులో కలిసి పేగులను సతాయిస్తుంటే
వాయువు చేరి వాతం సృష్టిస్తుంటే
అర్థము కాని అభాగ్యుడు అల్సరని అరుస్తుంటే
ఆకలి క్యాన్సర్ అనాధ శవంలా ఉండిపోతుంది..
బిగబట్టినా కన్నీరు ఉప్పెనలా ఎగుస్తుంటే
ఉదరములోని బడబాగ్ని తనువును కాల్చి వేస్తుంటే
ఎంత గంగను తాగిన ఎరుపు రంగు ఎక్కడం లేదు
చేసిన కర్మ మాత్రం ఏ వర్ణము ఆపడం లేదు..
కలగన్న ఆశలు చేతి వేళ్ళ మధ్య రాలిపోతుంటే
అరచేతి గీతలు భవిష్యత్తు నిలబడడం లేదు
పెరిగిన ధన రేఖ దారిద్రం వైపు నడిపిస్తుంటే
కోరికల శిఖరాగ్రం నేలకు ఎప్పుడు దిగుతుంది...

