నిశి తలుపులు
నిశి తలుపులు
నిశి తలుపు తెరచి పిలువగా రేయి చెంత చేరెనా
శశి కానరాని నింగిలో కరిమబ్బు విహరించెనా
చిత్తడి నేలపై పుత్తడి సిరులకై
కురిసిన చినుకులే తడిపొడి జోల పాడేనా
వెన్నెల కాంతులే వెలవెలబోయిన
చిటపట జల్లులే చలువ పంచేనా
అలసిన తనువులపై తొలకరి వాన
హాయి మొలకలేసేనా
చీకటి చెరిపిన దిక్కుల ఎల్లలు నిదురపుచ్చేనా
హద్దులు ఎరుగని కలల తళుకులు సరాసరి కనులను చేరేనా
మిన్ను ను మన్ను ను కలుపుతూ వర్షపు ఒప్పందం ఇపుడేనా
చినుకుల లాలి సాగేనా

