లోయల్లోకి.... శ్రీనివాస భారతి
లోయల్లోకి.... శ్రీనివాస భారతి


ముత్యాల్లా
నీటి బిందువులు
మోమునుండి పాదాలదాకా జారుతూ
ముచ్చట గొలుపుతుంటే
చూసేందుకు కళ్ళు కలువలైతే
సుతారంగా
చేతుల్తో
మెల్లగా తుడుస్తూ
కళ్ళు ఆర్పుతూ వెలిగిస్తూ
బిందువులు ప్రవాహమై
చలిలో వెచ్చటి మధురానుభూతి
శరీరాన్ని పులకరింప జేస్తుంటే
వర్షం
నాతో పోటీ పడి
నీ స్పర్శా సుఖాన్ని పొందితే
చూస్తున్న నాకు ఎంతో ఈర్ష్య
ఆకొండలు నీకన్నా
ఎక్కువ ఆనందం పొందుతున్నట్టున్నై
కిందకు వదిలేస్తూ....నీటిని
లోయల్లోకి జారే జలపాతంలా
కొన్ని బిందువులు మాయమై పోతున్నాయి
సింధువులుగా నిండిపోతూ
కళ్ళు పట్టని ఆ ఆనందాల లోకంలో
ప్రకృతి కన్యలా నడిచొచ్చే నువ్వు
దేవకాంతవా...దేహశాంతివా
కురుస్తూ అగుతూ
నిన్ను అమూలాగ్రం తడిపేస్తుంటే
చూసేందుకు కళ్ళు చాలవు
నన్ను మాత్రం ఒకటీ ఆరా
ముక్కు కొనల పలుకరిస్తే
నాకెంత కోపం రావాలి మరి?
నీ రూపం చెరిపేసే జడివాన
నా కళ్ళని తాకలేదేందుకో
నేను వర్షాన్నైనా బాగుణ్ణు
నీ హర్షాన్ని పొందేవాడినే కదూ...
రాతల గీతల బ్రతుకులకు
వర్ణనలే ఆనందాలిస్తాయి..
ఉహల్లోనే అందాన్నిస్తూ...
--------*************--------
( కొద్దీ దూరమే పడే వానపై కోపం తో...)