కవిత్వమొక కవచం
కవిత్వమొక కవచం
పగలంతా..
ముగింపు లేని దారుల్లో ప్రయాణం చేసి..
చిరిగిన బతుకు పేజీల్ని రాత్రి కొక్కానికి వేలాడదీసి..
కలలు నిండిన నిదుర కొలనులో మునిగిపోయాను..
ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది..
ముక్కలుగా తెగిపడ్డ అనుభూతుల ఆత్మల దాడి..
అనుబంధాల భరిణెలో రక్తసిక్తమైన మానవీయ గంధం...
నరాలు చిట్లి శరీరమంతా నెత్తుటి వర్ణం..
రాత్రంతా అవ్యక్త విస్మయావస్థలో
అటూ ఇటూ దొర్లింతలు..
మనిషికీ మనిషికీ మధ్య ఏర్పడ్డ కృత్రిమ అఖాతాల్ని దాటలేక
కళ్ళను, కాళ్ళను, స్పర్శల్నీ కన్నీరు తొలుస్తున్నప్పుడు నేనో శూన్యాకాశమయ్యాను..
నన్ను నేను చూసుకోవడానికి, నడవడానికి, నవ్వడానికి
స్వార్థం కొసలకు వంచన అంచుల్ని ముడేసి.. ఆత్మీయ లోకంలోకి గిరాటేసి కసిగా నవ్వాను..
విధ్వంస నిద్ర కౌగిళ్ళలో ఇమిడిపోనందుకు.. కనురెప్పలపై కన్నీటి సునామీలు పగిలిన క్రౌర్యం...
కనిపించని శిఖరాగ్రం చేరుకునేందుకు..
కాంక్షల దుఃఖతీరాల్ని నిర్మించిన నిజం
నాకు తట్టనేలేదు..
ఆవిరైన పాదముద్రలు నిప్పుల వానై కురుస్తుంటే..
తలదాచుకునేందుకు మమతల గుడారాల అన్వేషణ...
దూరంగా ఏవో ఆస్పష్ట దృశ్యాదృశ్యాలు..
ఏడుస్తూ.. వెక్కిరిస్తూ.. దీవిస్తూ
అప్పుడప్పుడు అద్దాన్ని చూయిస్తూ
ఇంకా నా లోలోపలేదో కరుణ మిగిలున్న సంకేతాలు..
తప్పిపోయిన వాడెవడో తలుపుతట్టినట్లు ధ్వనులు..
మేలుకోవాలనుంది..
ఆత్మ సౌందర్యాన్ని వికృతం చేస్తున్న
స్వార్థఅంతరంగాన్ని ఎదుర్కోవాలనుంది..
చెదిరిపోయిన నన్ను నేను సమీకరించుకునేందుకు చూపుల బాణాలతో అక్షరాల్ని ఆహ్వానిస్తున్నా..
బయటి ప్రపంచం నుండి కాదు..
నా నుండి నన్ను కాపాడుకోవాలి..
భయాల నుండి.. భ్రా0తులనుండి..
నా చుట్టూ నన్నే తిప్పుకునే కక్ష్యల నుండి..
అందుకే నేనిప్పుడు..
కవిత్వాన్ని నా అంతరాత్మకు
కవచంగా మార్చుకున్నా..!!

